Sunday, September 13, 2009

సోది సెపుతాను సోదీ...

నా గురుంచి స్వ సోది లో చెప్పాను..
ఇప్పుడు చెప్ప బోయేది ఇంక స్వగతం...... స్వాగతించండి.
నా జన్మ నామం వేంకట సత్య సూర్య ప్రసాద వాణీ కన్నాజీ రావు శర్మ ...దాన్ని కుదించి మధించి మా నాన్నగారు వేంకట వాణీ కన్నజీరావు చేసారు నేను ఆరో తరగతిలో చేరినప్పుడు. బహుశా రిజిస్టర్ లో సరిపడా జాగా ఉండదని అనుకున్నారేమో .
అసలు చెప్పొచ్చేదేంటంటే నేను హై స్కూల్ కి వచ్చే దాక నాకు నాపేరు అంట ఉన్నదని తెలియే తెలీదు.అందరూ బుజ్జీ అంటూంటే అదే నాపేరనుకునే వాణ్ణి.
అనకాపల్లి గవరపాలెం ,కస్పా వీధిలో మా ఇల్లు (అదే అద్దిల్లండీ ) 10 అడుగుల దూరం లో నేను చదివిన ప్రైమరీ బడి .. అదే కస్పా బడి .మా మామ్మ (బామ్మ/నాయనమ్మ మీ ఇష్టం ,కాని నాకు మాత్రం మామ్మే..!) మా నాన్న ఇద్దరూ టీచర్లు అవటం వలన బడిలో అందరూ తెలుసు.హెడ్డు మాస్టర్ నుంచి అటెన్డెర్ దాక అందరూ పరిచయం.మూడో ఏటినే నేను కొంచెం తెలివి ప్రదర్శించే సరికి నన్ను మా మామ్మ తనతో పాటు బడికి తీసుకెళ్ళేది.అలా మొదలైన నా చదువు అలా అలా కస్పా బడికి వెళ్లేట్టు చేసింది. అందులో గమ్మత్తేంటంటే నేను బడి కి అయితే వెళ్ళే వాణ్ణి గాని నా పేరు రిజిస్టర్ లో ఉండేది కాదు, ఎందుకంటారా...? నా వయసు అప్పటికి సరిపోదు కాబట్టి.(ఇప్పట్లా అప్పుడు నర్సరీ లు కే జీ లు లేవు మున్సిపాలిటీ బడి ఒకటి తోటే మొదలు ) అలాగే నా చదువు ఏ క్లాస్ లోనూ పేరు లేకుండా అయిదేళ్ళు అలాగే గడిచింది ఒకట్నించి అయిద్దాక .
నాతొ కల్సి చదివిన వాళ్లందరూ నా కన్నా పెద్దవాళ్ళే.. ఆ తేడా నాకెప్పుడూ అనిపించ లేదు మరి .పొద్దున్నే ఎవరో ఒకరు వచ్చినన్ను ఎత్తుకుని మరీ తీసుకెళ్ళేవారు.వాళ్లు నా టీచర్లే కాని, అటెన్డెరే గాని లేదా నా స్నేహితులే కాని ఎవరో ఒకళ్ళు వచ్చి మాత్రం బడికి తీసుకెళ్ళే వాళ్లు.మధ్యలో ఒక పాల గుళ్ళీ తో బొర్నవిటా వో, పాలో ఇంకేదో ఒకటి మా అమ్మ పంపేది.
సన్యాసమ్మ అని అటెండర్ ఉండేది ఆవిడా మొత్తం బడిలో ఉన్నంత సేపు నా భాద్యతలు (అంటే అన్నీ చెప్పాలా ఏమి) చూస్కోనేది.ఆకలేస్తే లోపల్నించి కేకేస్తే చాలు ఏదో ఒకటి తినడానికి వచ్చేసేది.అంత బలమైన నెట్వర్క్ మనది అప్పట్లో. ఆడ టీచర్లని అమ్మగారూ అని మగ టీచర్లని మాషారూ అని పిల్చే వాళ్ళం.నేను చదివే టప్పుడు పేరీ రమణ గారు హెడ్ మాష్టర్ ,నారాయణ మూర్తమ్మగారు ,లలితమ్మగారు,ధనియాలు గారు (Danial)  ,ఇంకో రమణ మాషారు,మోహనరావు గారు వీళ్ళంతా నాకు చదువు చెప్పిన వాళ్ళే ...నన్ను ముద్దుగా చూసుకొన్న వాళ్ళే..
నా స్నేహితుల గురించి అనుకోవాలిక్కడ ..ఒకట్నించి పదో తరగతి దాక నాతొ కలిసి చదువుకున్నది కట్టా వెంకటరాజు ..మిగిలిన వాళ్లు నాతొ కస్పా బడిలో చదివిన వాళ్లు నాగుల కొండ నానాజీ,మళ్ళనూకరాజు ,సదాశివరావు ,కే జీ రమేష్ ,అజీజ్....కాస్త దగ్గరగా తెలిసిన వాళ్లు గుర్తున్నవాళ్ళు.
నాకిప్పటికీ గుర్తు..బడి లో చిన్న స్థలం ఉండేది దానిలో నారింజ చెట్టు, చేమ  మొక్కలు ఆ పక్కనే ఒక నీళ్ళొచ్చే గొట్టం (పైపండీ బాబూ) ఉండేవి .మధ్యలో కొట్టే గంటని ఒంటి బెల్ అనే వాళ్ళం.ఆ సమయం లో కాస్త ఆట విడుపు నీటి తో ఆటలు నారింజ చెట్టు పింజెలు కోయటం ,చేమ  ఆకుల పైన నీళ్లు పోసి మెరిసే ఆ బిందువుల్ని చూసి ఆనందించడం..ఒక విధంగా మర్చి పోలేనివి.ఒక సారి నారింజ పింజే కోసి వాసన చూస్తూ ఉంటే అది ముక్కులోకి పోయి చాల గొడవ అయింది .
మన పేరీ రమణ గారంటే ఒక ఐడెంటిటీ ...పొడుగు చేతుల తెల్ల లాల్చీ ,పైజామా ఒక వీభూది బొట్టు తోటి చాల పొడుగ్గా ,ఠన్గ్ మనే కంఠ స్వరం తో ,సన్నపాటి బెత్తం పట్టుకొని ఆయన బడి లోపల తిరుగుతూ ఉంటె మరి అందరికి ఒహ విధంగా హడల్  !
ఇంకొక రమణ మాష్టర్ అయితే శొంఠి  పిక్కలు  (అందరికి తెలుసనుకుంటా!) ఇవ్వడం లో ఎక్స్పర్ట్ .లలితమ్మ గారైతే ఒక విధంగా సీరియస్ గానే ఉండీ వారు.నారాయణ మూర్తమ్మ గారయితే నన్ను మరీ నెత్తి కి ఎక్కించు కునే వారు.. మా బుజ్జి గాడంటే మా బుజ్జి గాడనీ.....
చిన్నప్పటి ఇల్లు :
గవరపాలెం కస్పా వీధిలో ఉండేవాళ్ళం..అద్దె ఇల్లు ,నీలం రంగు చెక్క  కటకటాలు..బయట చిన్న చిన్న అరుగులు నాపరాయి వరండా,సిమెంటు ఫ్లోర్ తో  ఒక హాలూ (అదే బెడ్ రూం కూడా), ఒక డైనింగ్ కం స్టోర్ రూం ఒక సన్నపాటి కిచెన్ పక్కనే స్నానాల గది  ....బయటికి వచ్చి చుట్టూ తిరుక్కుంటూ వెళ్తే ఒక మరుగుదొడ్డి ....ఇంకు బెడ్రూం లోంచి వెనకకు వెళ్తే డాబా పైకి దారి..విశాల మైన డాబా రెండు లెవెల్స్ లో !!
డాబా పైన మొక్కలు ...ఇప్పటికి నాకు వాము ఆకుల వాసన గుర్తే !!!